29, మే 2015, శుక్రవారం

Mutyala muggu introduction

20, మార్చి 2015, శుక్రవారం

బాపు గారు మనసారా మెచ్చిన తెలుగు కార్టూనిష్టు మన సరసి గారు ...

 తర్వాత,  చెప్ప లేదంటనక పొయ్యేరు సుమీ ! .. ఈ టపా పాతదే ... కానీ. సరసి గారి గీతా ప్రపంచం నిత్య హరితం. నవ నవోన్మేషం. ఈ తర్వాత కూడా మన సరసి గారు వందలాది కార్టూనులు వేసారు. వేస్తూనే ఉన్నారు. ఇటు అచ్చులోనూ, అటు అంతర్జాల పత్రికలలోనూ  వీరి కార్టూనులు అసంఖ్యాకంగా వస్తూనే ఉన్నాయి. అంచేత, ఈటపా మళ్ళీ వెలుగు చూస్తే తప్పు లేదు కదా !

చదవండి మరి .....

తాడు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచే వ్యక్తి, ఆ చివరి నుండి ఈ చివరి వరకూ ఎక్కడా తూలి పడి పోకుండా నడిస్తేనే కదా, అతడు ఆ విద్యలో విజయం సాధించి నట్టు !
రంజకం అంటుకుని, ఝయ్ ఝయ్ మని వెలగడం మొదలు పెట్టిన చిచ్చు బుడ్డి అంత లోనే తుస్సుమంటే అదోలా ఉంటుంది.
బ్రహాండమయిన పబ్లిసిటీ ఇచ్చిన చిత్రరాజం మొదటి రీలే మొహం మొత్తేస్తే రెండో ఆట వేసే ప్రసక్తే ఉండదు కదా.
గొప్ప ఆర్భాటాలకు నీరసమైన ముగింపులు అందగించవు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒక కార్ట్యూన్ల పుస్తకంలో మొదటి కార్టూను నుండి చివరి కార్టూను వరకూ కూడా పొట్ట పగిలేలా నవ్వించ గల కార్టూన్ల పుస్తకం దొరికితే ఎంత బావుంటుంది చెప్పండి?
ఆ ముచ్చట నిశ్చయంగా నూటికి రెండు వందల పాళ్ళు తీర్చ గల మంచి కార్టూన్ల పుస్తకాలు - సరసి గారి కార్టూన్ల పుస్తకాలు రెండూనూ.
సరస్వతుల రామనరసింహం గారు సరసి అనే కలం పేరుతో రెండు కార్ట్యూన్ పుస్తకాలు ప్రచురించారు.
ఇప్పటికే వందలాది కార్ట్యూన్ అభిమానుల పొట్టలు చెక్కలు చేసిన నేరానికి సరసి గారు ఇలాంటి కార్టూన్లు ఇంకా వేలాదిగా వేయాలని , ఆవిధంగా వీరికి కఠిన దండ (న) విధించాలని యువరానర్,
కోరుకుంటున్నాను.

సరసిజ మనువిద్ధం శైవలేనా2పి రమ్యం
మలినమపి హిమాంశో ర్లక్ష్మ లక్స్మీం తనోతి ...

అంటాడు శకుంతల గురించి కాళిదాసు. నాచు చేత కూడినదై నప్పటికీ పద్మం మనోహరంగా ఉంటుంది. మాలిన్యం కలదైనప్పటికీ చంద్రుని లోని మచ్చ శోభను విస్తరిస్తోంది అని శ్లోకంలో ఈ రెండు పాదాలకీ అర్ధం.

సరసి గారి కార్టూన్లు కూడా ఆయన మాటల్లోనే చెబుతే, ఆస్తిపాస్తులు అట్టే వున్నవి కావు. ఎక్కువగా మధ్య తరగతి ప్రాణులు. సూటు వేసుకో లేని బడుగు బనీను జీవులు. నేతల చుట్టూ తిరగకుండా , నేత బట్టలు చుట్టుకుని తిరిగేవి. సమస్యల్లో నవ్వులు వెదుక్కునేవి. తమ మీద తామే పడి నవ్వుకునేవి. ఆ విధంగా ఈ కార్టూన్లన్నీ బడుగుల జీవితాల్లో నుండి, వారి అలవాట్ల నుండి, ఆలోచనల నుండి, ఆశల నుండి, నిరాశల నుండి,మాటల్లోంచి, చేతల్లోంచి, వచ్చిన దినుసులే.

అలా ఈ రెండు పుస్తకాలలోని కార్టూన్లు ‘సరసి’జ మనువిద్ధాలు.

సరసి గారి కార్టూన్లు ఆంధ్ర ప్రభలో వచ్చే రోజులలో శ్రీ బాపు గారి నుండి ఆ పత్రికా సంపాదకులకు ఈ విధంగా ఉత్తరం వచ్చింది:

‘‘ మీ పత్రికలో సరసి అన్నతను ( లేదా, ఆమె) వేస్తున్న కార్టూన్లు చాలా బావుంటున్నాయి.
తెలుగు కార్టూనిస్టులలో ఆమాత్రం తెలివైన వానిని ఇంత వరకూ చూడ లేదు’’
బాపు గారి నుండి ఇంత గొప్ప కితాబు అందుకున్న సరసి గారి కార్టూన్ల గురించి వేరే చెప్పనవసరం లేదు.
ప్రతి పద్యము నుందు చమ
త్కృతి గలుగం చెప్ప నేర్తు వెల్లడ బెళుకౌ
కృతి వింటి మపారముగా
క్షితిలో నీ మార్గ మెవ్వరికిన్ రాదు సుమీ !

అని, నుతిస్తాడు రఘునాథుడు విజయ విలాస కర్త చేమకూరి వెంకన్నను.
చేమకూర కవి ప్రతి పద్యం లోనూ చమత్కారం చిలికిస్తే, ప్రతి గీత లోనూ, ప్రతి రాత లోనూ చక్కని చమత్కారాన్ని, వ్యంగ్యాన్ని, హాస్యాన్ని పండించిన అచ్స తెలుగు కార్ట్యూనిస్ట్ సరసి గారు. వారి కార్టూన్ లు తెలుగుతనంతో చక్కిలిగంతలు పెడుతూ ఉంటాయి.
మనమీదేనర్రోయ్ అనిపిస్తూ ఉంటాయి.
ఆ పుస్తకాలను చూస్తే ఈ రహస్యాన్ని మీరు కూడా నాలాగే కనిపెట్ట వచ్చును.
సరసి గారి గీతా మాధుర్యం రుచి చూడడం కోసం వారి కార్టూన్ పుస్తకాలలో ప్రచురించిన మొదటి, చివరి కార్టూన్ లు సరదాగా ఇక్కడ చూడండి:

ఇవి సరసి కార్టూన్లు మొదటి సంకలనం లోని తొలి పుట లోని కార్టూన్ లు.




అదే పుస్తకం లోని చివరి పేజీ కార్టూను ఇది!



సరసి కార్టూన్లు - 2 పేరుతో వచ్చిన రెండవ సంకలనం లోని మొదటి కార్టూను ఇది !




ఆ కార్టూన్ల పుస్తకం లోని చివరి పేజీలో ఉన్న కార్టూను ఇది !
రెండు పుస్తకాల లోనూ తొలి , మలి కార్టూన్ ల రుచి చూసారు కదా ? ఇహ మధ్యలో ఉండే మాధుర్యాన్ని మీరే జుర్రుకోండి ...తనివి తీరా నవ్వు కోండి. అంత కంటె ముందు ఈ కార్టూన్ పుస్తకాలను కొనుక్కోండి. అది మాత్రం మరిచి పోకండేం?
ఎక్కడ దొరుకుతాయంటారా? అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల వద్ద దొరుకుతాయి. వెల గురించి బెంగ లేదు. మీరు ఒక్కో పుస్తకానికీ వంద చొప్పున రెడింటికీ రెండు వందలు యిచ్చి, పాతిక రూపాయల చొప్పున మొత్తం ఏభై రూపాయలు ఇమ్మని దబాయించి మరీ వసూలు చేసుకోండి. కాదంటే సరసి గారికి కంప్లయింట్ చేయండి.
అన్నట్టు, ఈ కార్టూను పుస్తకాలు కొన్న వారికి కలకండల్లాంటి తియ్యని ముందు మాటలు - శ్రీరమణ,తనికెళ్ళ భరణి గార్లవి - పూర్తి ఉచితంగా ఇవ్వబడును. ఆలసించిన కార్టూన్ భంగం. ఆపైన మీ యిష్టం. నన్ననకండి.
సరసి గీతలే కాదు, రాతలు కూడా చక్కిలి గింతలు పెట్టేవే. వాటి గురించి మరో మారు ....
ఇంకా వివరాలూ గట్రా కావాలంటే సరసి గారితోనే నేరుగా మాట్లాడితే ఓ పనైపోతుంది ...
వారి ఫోను: 09440542950 మెయిలెడ్రసు: sarasi-cartoonist@yahoo.com

18, ఫిబ్రవరి 2015, బుధవారం

15, ఫిబ్రవరి 2015, ఆదివారం

30, డిసెంబర్ 2014, మంగళవారం

6, డిసెంబర్ 2014, శనివారం

వెలుగు నీడల వేపు వేలు


శ్రీరంగం గోపాల రత్నం పాడిన ఎంకి పాట
‘‘ యేటి దరి నా యెంకి’’
‘ ఈ రేతి రొక్కెతవు యేమొచ్చినావే ?’
     ‘ఆడు నేనిక్కడే ఆడినామమ్మా !’
యేటి నురగల కేసి యేటి సూశేవే ?’
   ‘ మా వోడి మనసిట్టె మరుగుతాదమ్మా !’
‘సెంద్ర వొంకలొ యేటి సిత్ర మున్నాదె !?’
   ‘ వొంక పోగానె మా వాడొస్తడమ్మా !’

‘ఆడు నేనిక్కడే ఆడి నామమ్మా !’
‘మా వోడి మనసిట్టె మరుగుతాదమ్మా !’
‘వొంక పోగానె ఆడొస్తడమ్మా !’
( ఎంకి పాటలు ... నండూరి  సుబ్బారావు ) 


26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

విజయ నగరం మహా రాజా ప్రభుత్వసంస్కృత కలాశాల పూర్వ విద్యార్ధల సమావేశం

విజయ నగరం ప్రభుత్వ మహా రాజా  సంస్కృత కలాశాల పూర్వ విద్యార్ధుల సమావేశం తే 7-10-2012న జరిగింది. ఆ సందర్భంగా మా 1969 - 1972 బ్యాచ్ కు చెందిన మిత్రులం కలిసి ఆనందంగా గడిపాం ! దానికి చెందిన ఫొటోలు కొంచెం ఆలస్యంగానయినా  ఈ వేడుక బ్లాగులో పెడుతున్నాను. త్వరలో పూర్వ విద్యార్ధల రచనలతో ఒక పుస్తకం వెలువడనుంది. అప్పుడు మళ్ళీ అందరం కలవబోతున్నాం ! ఆ పుస్తకంలో మా బ్యాచ్ వాళ్ళవే కాక కాలేజీలో చదివిన పూర్వ పూర్వ విద్యార్ధుల రచనలు చోటు చేసుకుంటున్నాయి. వారిలో సాహిత్య లోకంలో చాలా ప్రసిద్ధులయిన వారి రచనలు కూడా వెలువడనున్నాయి ! మళ్ళీ కలిసే మంచి రోజు కోసం ఎదురు చూస్తూ మరో సారి ఆ నాటి తీపి గుర్తుల నెమరు వేత ఇది !









8, సెప్టెంబర్ 2014, సోమవారం

1, అక్టోబర్ 2013, మంగళవారం

అమ్మో, నాకు బయ్యం ! ... చిన్నారి చిట్టి పాప రాసిన చిట్టి కథ



దొంగ గారు

మ్మ కథలు చెబుతుంది. అమ్మమ్మ కథలు చెబుతుంది. తాతయ్య కథలు చెప్పడమే కాదు చక్కని చిన్న చిన్న పద్యాలూ, శ్లోకాలూ కూడా చెబుతాడు. నాన్న కథలు చెప్పరు, కానీ, కథలు రాస్తారుట ! నేను చదవ లేదనుకోండి ... పెద్దయితే చదువుతానులే.

అంచేత, నాకూ కథ రాయాలనిపించింది. వెంఠనే పెన్సిలు తీసుకుని నోటు పుస్తకంలో గబగబా రాసీసేను.

కథ పేరు : దొంగ గారు

అనగనగనగా నేమో ఒక ఇల్లు. అందులో అమ్మా, నాన్నా, అక్కా, నేనూనూ.

ఒక రాత్రేమో అమ్మా వాళ్ళింటికి, అంటే మా ఇంటికే లెండి ఒక దొంగ గారు వచ్చేరు. అంతా బజ్జుని ఉన్నాం.

దొంగ గారు మా ఇంటిలో డబ్బూ బంగారఁవూ అదీ పట్టుకు పోడానికి వచ్చేరన్న మాట.

అందరం లేచి దొంగ గారిని చూసేం. దొంగ గారు కూడా మమ్మల్ని చూసేరు.

‘‘ దొంగ గారూ, దొంగ గారూ ! మా ఇంటిలో కొంచెమే డబ్బు లున్నాయి. మా చిట్టికి పుస్తకాలూ, రంగు పెన్సిళ్ళూ అవీ కొనాలి. మా డబ్బులు పట్టుకు పోవద్దండీ ’’ అని, నాన్న దొంగ గారితో అన్నారు.

అమ్మేమో, ‘‘ చిట్టి పాపకి బోర్నవిటా, నూడిల్సూ, పుట్టిన రోజుకి బుట్టల గవునూ అవీ కొనాలి. మా కొంచెం డబ్బుని మీరు పట్టుకు పోవద్దూ ’’ అనంది.

అక్కేమో,‘‘ చిట్టి పాపకి రిబ్బన్లూ, జడ పిన్నులూ కొనాలి. మా ఇంట్లో కొంచెమే డబ్బులున్నాయి. తీసుకు పోవద్దూ, ప్లీజ్ !’’ అంది.

దొంగ గారు విన లేదు. ‘‘ మా చిన్నబ్బాయికి బువ్వ పెట్టాలి. నా దగ్గర డబ్బుల్లేవు. అందుకే మీ కొంచెం డబ్బుని తీసుకు పోతాను’’ అన్నాడు కోపంగా.

అప్పుడు నేనేమా ధైర్యంగా దొంగ గారి దగ్గరకి వెళ్ళి, ‘‘ దొంగ గారూ, దొంగ గారూ ! మరేమో, మా అమ్మ రోజూ దేవుడికి పూజలు చేస్తే, దేవుడు మాకు కొంచెం డబ్బులు యిచ్చేడు. ఇంకా ఎక్కువ పూజలు చేస్తే యింకా ఎక్కువ డబ్బులు యిస్తాడన్న మాట.

మరందు చేత మీరు కూడా ఆంటీకి చెప్పి దేవుడికి ఎక్కువ పూజలు చేయమని చెప్పండి. దేవుడు మీకూ బోలెడు డబ్బులు ఇస్తాడు. మా కొంచెం డబ్బులు ఇప్పుడు తీసుకు పోకండేం ... దేవుడు మీకు చాలా డబ్బులు యిచ్చేక ఆంటీకీ,తమ్ముడికి మంచి బువ్వ పెట్టొచ్చును. మీరు కూడా ఈ మురికి బట్టలు మానీసి మంచి బట్టలు కుట్టించుకో వచ్చును...’’ అన్నాను.

దొంగ గారు నాముఖంలోకి చూసి, నా దగ్గరకొచ్చి. నాబుగ్గ మీద ముద్దు పెట్టీసుకున్నారు.

మరింక మా కొంచెం డబ్బులు తీసుకు పోకుండానే వెళ్ళి పోయేరు.

****** ***** ***** ***** ***** ***** *****

నాన్న నేను రాసిన ఈ కథ చదివి, అమ్మకు చూపించేరు. అమ్మ కూడా చదివింది. ఇద్దరూ ఎందుకో చాలా సేపు పడి పడి నవ్వేరు.

తరవాత నాన్న అన్నారూ : ‘‘ కథ బావుందమ్మా ,,, కానీ దొంగని దొంగ గారూ, దొంగ గారూ అని ఎందుకు రాసేవు. దొంగ అని రాయలేదేం ?’’ అనడిగేరు.

అందుకు నేను చెప్పేనూ : ‘‘అమ్మో ! నాకు బయ్యం ! ...’’




3, మే 2013, శుక్రవారం

మా ఆవిడకి కోపం వచ్చింది ! ..( అను ).. ఒక ఫొటో కథ ...



మా ఆవిడకి కోపం వచ్చింది ! 

వచ్చిందంటే , రాదూ మరి ! అసలు మొగుళ్ళు చేసే తింగరి పనులకు ఆవిళ్ళకు కావిళ్ళ కొద్దీ కోపాలు వస్తాయంటే, పాపం, వారిదా  తప్పు ?

 భర్త అంటే, భరించే వాడని వ్యుత్పత్తి చెబుతారు కానీ, నిజానికి ఆ మాట భార్యలకు వర్తిస్తుంది. క్షమయా ధరిత్రీ అన్నారు కదా !

మన కోపాలను, చిరాకులను, పరాకులను, బలహీనతలను, వ్యసనాలను, అధిక ప్రసంగాలను, అవమానకర వ్యాఖ్యానాలను, పిలుపులను, తింగరి వలపులను, తలపులను, దుబారాలను, తెలివి తక్కు పనులను, తెచ్చే తగాదాలను, అలవిమాలిన అహంకారాలను, బద్దకాలను, అవసరాలను కూడా వాయిదా వెయ్యడాలను, అర్ధ నగ్నంగా ఇంట్లో తిరగడాలను, మాసిన బట్టలు రోజుల కొద్దీ మార్చుకోక పోవడాలను, చెప్పుకునే గొప్పలను, కప్పి పుచ్చుకునే తప్పులను, రాద్ధాంతాలను, వెర్రి మొర్రి సిద్ధాంతాలను, పిచ్చి కవిత్వాలను, వెర్రి బ్లాగులను, పువ్వులయినా కొనని పిసినారి తనాలను,ముభావాలను, ముఖం చాటేయడాలను, మన బట్ట తలలను, బాన పొట్టలను, పిట్ట కథలను, ... ఇది అనంతం. వీటిని ఆడాళ్ళు భరించడం లేదూ ? అన్నింటినీ భరిస్తూనే మొగుళ్ళను ప్రేమించ గలిగే, ఆడవారి ఓపికకి జోహార్లు !



ఆగాండాగండి. ధోరణి మరీ ఏక పక్షంగా ఉందంటారా ?

కొంపన్నాక, ఇన్నో, మరి కొన్నో ఇలాంటివి కొంచెం ఎక్కువ తక్కువలలో ఉంటాయి లెండి ...

ఇంతకీ ఏదో చెప్పాలని మొదలు పెట్టి , ఎక్కడికో వెళ్ళి నట్టున్నాం కదూ !

అసలు విషయ మేమిటంటే, మా ఆవిడకి కోపం వచ్చిందని కదూ చెప్పాను ? !

అవును. మా ఆవిడకి కోపం వచ్చింది !

ఎప్పుడంటారా ? దాదాపు ఏభై ఆరేళ్ళ క్రిందట !

ఆగాగాగాగాగు. ఏఁవిటీ, ఏభై ఆరేళ్ళ కిందట మీ ఆవిడకి కోపం

వచ్చిందా ? నీ ప్రొఫైల్ చూసాం. నీ వయసెంతో తెలుసు. ఏభై ఆరేళ్ళ క్రితం ఆ చిట్టి తల్లి మీ ఆవిడెలా అయిందీ ? ! మీది బాల్య   వివాహమా ?! అని మీకు డౌటొచ్చింది కదూ ?

అదేం కాదు, ఆమెకి ఆరేడేళ్ళప్పటి సంగతే యిది. ఆ వయసులోనే ఆ పిల్ల కి నేనే మొగుడినని పెద్దలు తీర్మానించీసేరు.  (  నేనూ డిసైడయి పోయే ననుకోండి !)  మాది మేనరికం. అంచేత,

ఆ పాపే ( ఆవిడే ) మా ఆవిడ. .

మా ఆవిడకు కోపం వచ్చిన విధంబెట్టి దనిన ...

అప్పట్లో మేం మా తాతగారింట అనంత పురం జిల్లా ఉరవ కొండలో చాలా కాలం ఉండే వాళ్ళం. మా తాత గారక్కడ రిటైర్డ్ సివిల్ సర్జనుగా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తూ ఉండే వారు.

తాత గారు మనవళ్ళకీ మనవరాళ్ళకీ వెళ్ళి నప్పుడల్లా కొత్త బట్టలు కుట్టించి యిచ్చే వారు. అందరికీ ఒకే రకం నిక్కరూ చొక్కాలూ, అమ్మాయిలకు ఒకే రకం గౌన్లూ అన్నమాట.

సరే, మా ఆవిడ కోపం గురించి చెబుతాను ...

ఆ రోజు అలాగే తాత గారిచ్చిన కొత్త బట్టలు నేనూ, ( తర్వాత ఎప్పుడో కానున్న ) మా ఆవిడా , మా చెల్లి కాంతీ
 ( పన్నెండో ఏటనే దానిని దేఁవుడు నిర్దాక్షిణ్యంగా మానుండి తీసుకు పోయేడు ) , మా ఆవిడ అన్న , అంటే , మా బావా వేసు కున్నాం.

మా ఆవిడ కోపానికి బీజం ఇక్కడే పడింది !

ఏం జరిగిందంటే, మా చెల్లి కాంతి కావాలనే పెంకె తనంతో మా ఆవిడకి కుట్టించిన గౌను వేసేసుకుంది ! దాని గౌను మా ఆవిడకి ఇరుకయి పోతుంది. ఎవరెంత చెప్పినా మా చెల్లి కాంతి ఆ గౌను తిరిగి ఇవ్వడానికి ఒప్పు కోలేదు. దాంతో పెద్దలు మా ఆవిడనే బతిమాలి , బామాలి మా చెల్లెలి గౌనునే ఫొటో కోసం వేసుకో మని ఒత్తిడి తెచ్చి బలవంతంగా అంగీకరింప చేసారుట. ఆ ఇరుకైన గౌను వేసు కోవాల్సి వచ్చి నందుకు మా ఆవిడకి కోపం వచ్చింది. రాదూ మరి ? ధుమ ధుమలాడి పోయింది. అందుకే ఫొటోలో బుంగ మూతితో కనిపిస్తోంది.

ఆ కోపంలోముద్దు ముద్దుగా లేదూ !

ఇంతటితో అయిందీ ? ! మా ఆవిడ ముచ్చట  పడి తెచ్చుకున్న గులాబి పువ్వును కూడా మా కాంతి లాక్కుంది . ఎంత అడిగినా ఛస్తే ఇవ్వనని భీఫ్మించుకు కూర్చుంది.

అందుకే ఫొటోలో చేతిలో గులాబీ పువ్వుతో నవ్వుతూ మా చెల్లాయి కాంతీ, కోపంతో చిటపట లాడి పోతూ బుంగ మూతితో, పొట్టి గౌనుతో మా ఆవిడా కనిపిస్తున్నారు చూడండి ... వాళ్ళకి చెరో వేపూ, అంటే, ఎడమ వేపు నేనూ, కుడి వేపు మా బావా ఉన్నాం. ఇది డబ్బా కెమేరాతో మా చిన్న మామయ్య  తీసిన ఫోటో.

ఇదండీ ఈ ఫొటో కథ ! ఈ చిన్నప్పటి ఫొటో అంటే నాకూ మా ఆవిడకీ ఎంతిష్టమో. చూసి నప్పుడల్లా నవ్వు కుంటూ ఉంటాం.

ఉరవ కొండ తీపి ఙ్ఞాపకాలతో కబుర్లు కలబోసు కుంటూ ఉంటాం.

ఇక ఫోటో చూడండి .

.. 

26, ఏప్రిల్ 2013, శుక్రవారం

23, ఏప్రిల్ 2013, మంగళవారం

చాటువులు 200 భావాలతో ...


చాటువులు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీనాథుడు. శ్రీనాథుని చాటువులతో పాటు,  ప్రసిద్ధ మయిన చాటువులు దాదాపు 200 వరకూ ఇక్కడ చదవండి !

22, ఏప్రిల్ 2013, సోమవారం

మా మంచి తెలుగు పద్యం


ఏర్చి కూర్చిన పద్యాలు , భావాలతో పాటు దాదాపు రెండు వందలు ఇక్కడ  పెద్దవి చేసుకుని చదవండి ...







20, ఏప్రిల్ 2013, శనివారం

విజయ నగరం పత్రికలు



విజయ నగరం నుండి వెలువడిన పత్రికలు ! 

రాజ యోగి               మాస పత్రిక                సంపాదకులు: గురజాడ శ్రీరామ మూర్తి 1885

తెలుగు హార్స్          ఆంగ్ల వార పత్రిక          సంపాదకుడు : కిళాంబి రామానుజాచార్యులు 1895

ఇండియన్ హెరాల్డ్                                     సంపాదకుడు : సి.వై.చింతామణి 1899

భారత మాత            మాస పత్రిక                సంపాదకులు : బి.వి.నాథ్ 1906

కామేశ్వరి               సారస్వత మాస పత్రిక   సంపాదకులు : పురాణం సూర్య నారాయణ తీర్థులు

కళలు                   సాహిత్య మాస పత్రిక      సంపాదకులు : బుర్రా శేషగిరిరావు 1920

ఙ్ఞాన దీపిక             పక్ష పత్రిక                     సంపాదకులు : మేడూరి శ్రీరామ మూర్తి 1923

నాటక కళ             మాస పత్రిక                  సంపాదకులు : మల్లాది విశ్వనాథ శర్మ 1923

కమ్మ                  మాస పత్రిక                    సంపాదకులు : బాబు కె.ఆర్. రాయ్ చౌదరి 1923

ఆర్య ప్రభ              ద్వివార సారస్వత పత్రిక    సంపాదకులు : దువ్వూరి జగన్నాథ శర్మ 1925

లలిత                  సారస్వత మాస పత్రిక        యువ జన సంఘం నిర్వహణ 1927

గంధర్వ               మాస పత్రిక                     సంపాదకుడు :  దువ్వూరి జగన్నాథ శర్మ 1929

కల్యాణి               సారస్వత మాస పత్రిక        సంపాదకుడు : గంటి సూర్య నారాయణ `932

మాతృ సేవ          వార పత్రిక                       సంపాదకుడు : పసుమర్తి వీర భద్ర స్వామి 1936

అడ్వైజర్              మాస పత్రిక                      సంపాదకుడు :కెరండాల్ శ్రీనివాస రావు 1937

విజయ               మాస పత్రిక                      సంపాదకుడు : కాకు పాటి కృష్ణ మూర్తి 1938

ఆంధ్ర మాత         మాస పత్రిక                     సంపాదకులు :ఆనవిల్లి ప్రకాశ రావు 1938

వందే మాతరం     వార పత్రిక సంపాదకులు :  కిళాంబి రంగాచార్యులు మరియు లంక సుందరం 1946

విజయి                వార పత్రిక                       సంపాదకుడు : గురజాడ సూర్య నారాయణ మూర్తి 1947

వాణి                   వార పత్రిక                       సంపాదకుడు : గురజాడ సూర్య నారాయణ మూర్తి 1948

విజయ వాణి        వార పత్రిక                       సంపాదకులు : శ్రీరంగం నారాయణ బాబు 1950

ప్రజా రథం            వార పత్రిక                      సంపాదకులు : భాట్టం శ్రీరామ మూర్తి 1965

ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్ర ప్రభ ల జిల్లా కార్యాలయం. 1984

ధర్మ బాణం          దిన పత్రి                       క సంపాదకులు ? 1989

విజయ నగరం టైమ్స్  దిన పత్రిక                సంపాదకులు :ఇ.వి.సురేష్ కుమార్ మరియు గెద్ద వర ప్రసాద్. 2002

శ్రీకళ                  ఆధ్యాత్మిక పక్ష పత్రిక       ప్రచురణ : సనాతన గురు కులం 2002

(వీటిలో ధర్మ బాణం, విజయ వాణి వంటి ఒకటో రెండో పత్రికలు నేడు వెలువడుతున్నాయి.)


                         (సేకరణ : శ్రీ పున్నమరాజు నాగేశ్వర రావు) 


సందేహమ్  :  ఈ టపాకీ, మీద ఉంచిన చిత్రానికీ సంబంధం ఏమిటయ్యా  వేడుక బ్లాగరూ ? నీకిది వాడుకా ?

జవాబు :       ఏం లేదు ,  ఊరికే ! నవ్వు కుంటూ చదివితే తల నెప్పి రాదని !








16, ఏప్రిల్ 2013, మంగళవారం

తిక్కలోడు



ఆడంతే నెద్దూ. మా కానోడు. ఇలగంటె అలగంతాడు. అలగంటె ఇలగంతాడు.

ఎడ్డెమంటె తెడ్డెమనీ రకపోడు. ఆడికి తెల్దు. సెప్పితినుకోడు. అదేటంటే, గయ్యిన యింతెత్తు నెగుస్తాడు. నాను కాబట్టి ఆడితో నెగ్గు కొత్తన్నాను కానీ, అదే మరో ఆడదాయయితే ఆడికో దండఁవెట్టి ఎలిపోదును కాదా.

ఓలమ్మ ఇలపింటోడు దొరికి నాడేటి ! సేపల యిగురు సెయ్యిమంతావేఁటి అనడిగితే, రొయ్యల ఏపుడు కావాలంతాడు. తిరపతెల్దారేటంటే, సిఁవాసెలం

సాల్దేటి ? అంటాడు. ఎంప్టీ వోడికి ఓటేద్దాఁవంటే, అచ్చె ! విందిరా గాందీకే ఎయ్యాలంటాడు. ఆయమ్మ ఉప్పుడు నేదు కదా అంతె ఆకాడికి ఎప్టీ వోడు మాత్తరం ఉన్నాడేటని పల్లికిలించి నవ్వుతాడు. ఎంప్టీ వోడంటే ఎంప్టీ వోడు కాదూ, మన సెంద్రబాబు నేడా అంతాను. అదిగదే, విందిరా గాందీ అంతే విందిరా గాందీ కాదూ, మన సోనియా అమ్మ అంతాడు. ఈడితో ఏగనేం బాబూ !

ఆ మద్దెన అదేటమ్మ, ఆ సినేమా ... యాది కొస్తాది కాదు .. అందల బాబేటంతాడూ ? నాక్కొంచెం తిక్కుంది. దానికో నెక్కుంది ! అంటాడు కదా ? మరీడికి తిక్కుంది కానీ నెక్క మాత్తరం నేదు.

ఈ మద్దెన నోక గ్యానం పెంచు కుందాఁవని టీ.పీ సూత్తన్నాను. అందల మన రాజకీయపోల్లు నిబ్బగ కూకోని మాటల్లొ కొట్టు కుంతున్నారూ ? సోద్దె మమ్మా ! సెప్ప నేను. అలగంతె ఇలగంతరు. ఇలగంతె అలగంతరు. ఆడవు నంతె ఈడు కాదంటాడు. జట్టీలాడీసు కుంతున్నారు. నువ్వు నాశినఁవై పోవాలంటే నువ్వు బూడిదై పోవాలంటాడు. నాను సేసిందే కరెస్టంటే, కాదు, నాను సెప్పిందే కరెస్టంటాడు మరోడు. ఆ గోలేటో, ఆ తగువు లేటో ? అల్ల మాటలేటో ? సెప్పీదేటో వొక్క అచ్చరం ముక్క అరదం కానేదనుకో.

అదంతా సూత్తూ ఉంటే, నాకేటనిపిస్తందంటే, నా పెనిమిటే నయమని పిస్తోంది.

టీ.పీ కట్టీసి, ఆడితో నెగు ! నెగు ! రొయ్యల ఏపుడు సెయ్యమన్నావు కాదా ? సేసినాను... రా, తిననానికి .... అన్నాను.

అప్పుడాడంతాడూ !

రొయ్యల ఏపుడేటే ? నెంజికానా ! సేపల పులుసు సెయ్య మననేదా ! నియ్యమ్మ. నీకు మెడ పోత్రఁవెక్కు వయి పోనాదే, అంటూ అరుపులే అరుపులు

మన బతుకులు ఇంతే కావాల్ర బగమంతుడా !

14, ఏప్రిల్ 2013, ఆదివారం

10, ఏప్రిల్ 2013, బుధవారం

ఉగాది కలల ప్రపంచం ... !!





ఉగాది కలల ప్రపంచం ...


కవులను లేపండి

కోకిళ్ళను కేకెయ్యండి

మావిళ్ళు చిగిర్చాయో లేదో పరికించండి

వసంతం వచ్చిందో, లేదో పరిశీలించండి

ఉగాది పండుగ

ఉల్లాసంగా జరుపుకోండి

ఇల్లంతా అలంకరించండి

కొత్త వస్తువులతో నింపెయ్యండి

అల్లుళ్ళను, అమ్మాయిలను పిలిపించండి

కొత్త బట్టలూ, నగలూ దండిగా పెట్టండి

ఖరీదైన కానుకలతో

ఉక్కిరి బిక్కిరి చేసెయ్యండి.

ఉగాది పండుగ వైభవంగా జరుపుకోండి

మీ అంత వారు లేరనిపించు కోండి.

ఈ కరువు రోజుల్లో

ఇవన్నీ ఎలా సాధ్యమండి ?

అని మాత్రం అడక్కండి ...

పైవన్నీ ఊహల్లో చేసెయ్యండి.

కలల్లో కానిచ్చెయ్యండి !

కళ్ళు మూసుకుని పడుకోండి !

కలల ఉగాది కమనీయంగా ఉంది కదండి ? !

















9, ఏప్రిల్ 2013, మంగళవారం

తెలుగులో బ్లాగు టపాలు రాసే వారికి గడుల బాధ ఇలా తొలిగి పోతుంది. మీరూ స్రయత్నించి చూడండి ...



ఈ మధ్య తెలుగు బ్లాగర్లలో కొందరు ఒక వింత సమస్య ఎదుర్కొంటున్నామని అంటున్నారు. అదేమిటంటే, బ్లాగు టపా అంతా రాసి పోస్టు చేసాక, బ్లాగుని చూసినప్పుడు టపాలో పదాల మధ్య, అక్షరాల మీద చిన్న చిన్న నలుచదరపు గడులు ఏవో కనిపిస్తున్నాయి. . వీటిని తొలిగించడం ఎలాగో తెలియక తికమక పడుతున్నామని అంటున్నారు.


మన బ్లాగు టపాలో అలా కనిపించే అసహ్య కరమయిన గడులు రాకుండా ఉండాలంటే నాకు తోచిన ఒక ఉపాయం ఉంది. మీరూ ప్రయత్నించి చూడండి. చాలా సుళువైన మార్గం అది !







ముందుగా పై చిత్రం చూడండి

పోస్టు చేయాలనుకుంటున్న మేటరుని పోస్తు చేయడానికి ముందు హైలైట్ చేయండి.

ఇప్పుడు ఆకృతీ కరణను తొలిగించండి అనే గుర్తు మీద క్లిక్ చేయండి ( ఈ గుర్తు చిత్రంలో ఎడమ నుండి ఐదోది. గమనించండి. ఇంగ్లీషు   టి   అక్షరంతో ఉంటుంది. )

ఇప్పటికీ మీ టపా హైలైట్ చేయ బడే ఉంటుంది.

ఇప్పుడు జంప్ బ్రేక్ తొలగించండి అనే దాని మీద క్లిక్ చేయండి. ( ఈ గుర్తు చిత్రంలో ఎడమ నుండి పదోది. గమనించండి. )

ఇంకేం ? ఇప్పుడు మీ టపాని మామ్మూలుగానే పోస్టు బటన్ నొక్కి పోస్టు చేయండి.

ఇప్పుడు డాష్ బోర్డు మూసి వేసి మీ బ్లాగు చూసుకోండి.

ఇంతకు ముందు కనిపించిన సెగ్గండ్డల్లాంటి గడులేవీ కనిపించవు.

మీరు హ్యాపీ ! అయితే, వెంటనే కామెంట్ పెట్టండి.







.