3, మే 2013, శుక్రవారం

మా ఆవిడకి కోపం వచ్చింది ! ..( అను ).. ఒక ఫొటో కథ ...



మా ఆవిడకి కోపం వచ్చింది ! 

వచ్చిందంటే , రాదూ మరి ! అసలు మొగుళ్ళు చేసే తింగరి పనులకు ఆవిళ్ళకు కావిళ్ళ కొద్దీ కోపాలు వస్తాయంటే, పాపం, వారిదా  తప్పు ?

 భర్త అంటే, భరించే వాడని వ్యుత్పత్తి చెబుతారు కానీ, నిజానికి ఆ మాట భార్యలకు వర్తిస్తుంది. క్షమయా ధరిత్రీ అన్నారు కదా !

మన కోపాలను, చిరాకులను, పరాకులను, బలహీనతలను, వ్యసనాలను, అధిక ప్రసంగాలను, అవమానకర వ్యాఖ్యానాలను, పిలుపులను, తింగరి వలపులను, తలపులను, దుబారాలను, తెలివి తక్కు పనులను, తెచ్చే తగాదాలను, అలవిమాలిన అహంకారాలను, బద్దకాలను, అవసరాలను కూడా వాయిదా వెయ్యడాలను, అర్ధ నగ్నంగా ఇంట్లో తిరగడాలను, మాసిన బట్టలు రోజుల కొద్దీ మార్చుకోక పోవడాలను, చెప్పుకునే గొప్పలను, కప్పి పుచ్చుకునే తప్పులను, రాద్ధాంతాలను, వెర్రి మొర్రి సిద్ధాంతాలను, పిచ్చి కవిత్వాలను, వెర్రి బ్లాగులను, పువ్వులయినా కొనని పిసినారి తనాలను,ముభావాలను, ముఖం చాటేయడాలను, మన బట్ట తలలను, బాన పొట్టలను, పిట్ట కథలను, ... ఇది అనంతం. వీటిని ఆడాళ్ళు భరించడం లేదూ ? అన్నింటినీ భరిస్తూనే మొగుళ్ళను ప్రేమించ గలిగే, ఆడవారి ఓపికకి జోహార్లు !



ఆగాండాగండి. ధోరణి మరీ ఏక పక్షంగా ఉందంటారా ?

కొంపన్నాక, ఇన్నో, మరి కొన్నో ఇలాంటివి కొంచెం ఎక్కువ తక్కువలలో ఉంటాయి లెండి ...

ఇంతకీ ఏదో చెప్పాలని మొదలు పెట్టి , ఎక్కడికో వెళ్ళి నట్టున్నాం కదూ !

అసలు విషయ మేమిటంటే, మా ఆవిడకి కోపం వచ్చిందని కదూ చెప్పాను ? !

అవును. మా ఆవిడకి కోపం వచ్చింది !

ఎప్పుడంటారా ? దాదాపు ఏభై ఆరేళ్ళ క్రిందట !

ఆగాగాగాగాగు. ఏఁవిటీ, ఏభై ఆరేళ్ళ కిందట మీ ఆవిడకి కోపం

వచ్చిందా ? నీ ప్రొఫైల్ చూసాం. నీ వయసెంతో తెలుసు. ఏభై ఆరేళ్ళ క్రితం ఆ చిట్టి తల్లి మీ ఆవిడెలా అయిందీ ? ! మీది బాల్య   వివాహమా ?! అని మీకు డౌటొచ్చింది కదూ ?

అదేం కాదు, ఆమెకి ఆరేడేళ్ళప్పటి సంగతే యిది. ఆ వయసులోనే ఆ పిల్ల కి నేనే మొగుడినని పెద్దలు తీర్మానించీసేరు.  (  నేనూ డిసైడయి పోయే ననుకోండి !)  మాది మేనరికం. అంచేత,

ఆ పాపే ( ఆవిడే ) మా ఆవిడ. .

మా ఆవిడకు కోపం వచ్చిన విధంబెట్టి దనిన ...

అప్పట్లో మేం మా తాతగారింట అనంత పురం జిల్లా ఉరవ కొండలో చాలా కాలం ఉండే వాళ్ళం. మా తాత గారక్కడ రిటైర్డ్ సివిల్ సర్జనుగా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తూ ఉండే వారు.

తాత గారు మనవళ్ళకీ మనవరాళ్ళకీ వెళ్ళి నప్పుడల్లా కొత్త బట్టలు కుట్టించి యిచ్చే వారు. అందరికీ ఒకే రకం నిక్కరూ చొక్కాలూ, అమ్మాయిలకు ఒకే రకం గౌన్లూ అన్నమాట.

సరే, మా ఆవిడ కోపం గురించి చెబుతాను ...

ఆ రోజు అలాగే తాత గారిచ్చిన కొత్త బట్టలు నేనూ, ( తర్వాత ఎప్పుడో కానున్న ) మా ఆవిడా , మా చెల్లి కాంతీ
 ( పన్నెండో ఏటనే దానిని దేఁవుడు నిర్దాక్షిణ్యంగా మానుండి తీసుకు పోయేడు ) , మా ఆవిడ అన్న , అంటే , మా బావా వేసు కున్నాం.

మా ఆవిడ కోపానికి బీజం ఇక్కడే పడింది !

ఏం జరిగిందంటే, మా చెల్లి కాంతి కావాలనే పెంకె తనంతో మా ఆవిడకి కుట్టించిన గౌను వేసేసుకుంది ! దాని గౌను మా ఆవిడకి ఇరుకయి పోతుంది. ఎవరెంత చెప్పినా మా చెల్లి కాంతి ఆ గౌను తిరిగి ఇవ్వడానికి ఒప్పు కోలేదు. దాంతో పెద్దలు మా ఆవిడనే బతిమాలి , బామాలి మా చెల్లెలి గౌనునే ఫొటో కోసం వేసుకో మని ఒత్తిడి తెచ్చి బలవంతంగా అంగీకరింప చేసారుట. ఆ ఇరుకైన గౌను వేసు కోవాల్సి వచ్చి నందుకు మా ఆవిడకి కోపం వచ్చింది. రాదూ మరి ? ధుమ ధుమలాడి పోయింది. అందుకే ఫొటోలో బుంగ మూతితో కనిపిస్తోంది.

ఆ కోపంలోముద్దు ముద్దుగా లేదూ !

ఇంతటితో అయిందీ ? ! మా ఆవిడ ముచ్చట  పడి తెచ్చుకున్న గులాబి పువ్వును కూడా మా కాంతి లాక్కుంది . ఎంత అడిగినా ఛస్తే ఇవ్వనని భీఫ్మించుకు కూర్చుంది.

అందుకే ఫొటోలో చేతిలో గులాబీ పువ్వుతో నవ్వుతూ మా చెల్లాయి కాంతీ, కోపంతో చిటపట లాడి పోతూ బుంగ మూతితో, పొట్టి గౌనుతో మా ఆవిడా కనిపిస్తున్నారు చూడండి ... వాళ్ళకి చెరో వేపూ, అంటే, ఎడమ వేపు నేనూ, కుడి వేపు మా బావా ఉన్నాం. ఇది డబ్బా కెమేరాతో మా చిన్న మామయ్య  తీసిన ఫోటో.

ఇదండీ ఈ ఫొటో కథ ! ఈ చిన్నప్పటి ఫొటో అంటే నాకూ మా ఆవిడకీ ఎంతిష్టమో. చూసి నప్పుడల్లా నవ్వు కుంటూ ఉంటాం.

ఉరవ కొండ తీపి ఙ్ఞాపకాలతో కబుర్లు కలబోసు కుంటూ ఉంటాం.

ఇక ఫోటో చూడండి .

.. 

5 కామెంట్‌లు:

www.apuroopam.blogspot.com చెప్పారు...

ఈ పోటో వెనకాతల ఇంత కథుందన్న మాట.అంత పాత ఫోటోని భద్రంగా దాచుకోగలిగారు కనుకనే ఇవాళ ఆ కథ మాకూ చెప్పగలిగారు.బాగుంది.

www.apuroopam.blogspot.com చెప్పారు...

ఈ పోటో వెనకాతల ఇంత కథుందన్న మాట.అంత పాత ఫోటోని భద్రంగా దాచుకోగలిగారు కనుకనే ఇవాళ ఆ కథ మాకూ చెప్పగలిగారు.బాగుంది.

మాలా కుమార్ చెప్పారు...

భలేవున్నాయండి మీ ఫొటో , దాని వెనకాల కథ :) మధురస్మృతి .

Unknown చెప్పారు...

మంచి మధురస్మృతి...భద్రంగా దాచుకున్నారిన్నేళ్ళూ!

Sudha చెప్పారు...

తెలుసుకున్నారూ స్త్రీల స్వభావాలూ.......తెలిసి తీర్చారూ ముద్దూ మురిపాలూ!!!