5, జనవరి 2010, మంగళవారం

జీవిత సూత్రాలు

జీవిత సూత్రాలు

దు:ఖం
ఇది అధికార సూత్రం
అంతటా అనువర్తి వస్తుంది
అరుభవించు నరుడా !

ఆదర్శాల సూత్రాలు
అన్ని సమస్యలనూ పరిష్కరించ లేవు
సమత గ్రహణాన్ని
స్వార్ధం సర్వత్రా బాధిస్తోంది.

చూదామన్న బహుళ గ్రహణం చేత
నాయకుల వాగ్దానాల సూత్రంలో
కార్యాచరణ మాత్రం
నిఫేధంగా ప్రవర్తిస్తోంది.

సామాన్య సంసారి జీవితం
లాటరీలో ఏ లడాగమమో వస్తేకానీ
బాగు పడేలా లేదు.

కష్టాలు ఎప్పుడూ ఆగమంగానే వస్తాయి.
దరిద్రానికి రోగాలు
ఆమ్రేడితం
ఆకలి వేసేటప్పుడు
పస్తులతో సంధి నిత్యం!

జీతం అందిన మరునాడే
జేబులు స్వత్వ రూపం ధరిస్తాయి.
పైసలకి లోపం, నెత్తి మీద చుట్టాల సంశ్లేషం
ఒక్క సూత్రంలోనే విధించ బడ్డాయి.

ద్రుతం లాంటి విశ్వాసం
అందరి మీదా ఉండీ లేనట్టుంటుంది.

కార్యం తనదైతే మాత్రం - తప్పకుండా
మాయమై పోతుంది.

నా యిష్టం. ఇది నా కష్టం ! అనేవి
గ్రామ్య ప్రయోగాలు
అది
నీ లక్షణ విరుద్ధ మైన భాష !
తెలుసుకో
సామాన్య మానవుడా !
^ ^ ^

ఈ గేయంలో వాడిన సాంకేతిక పదాలు ... తెలుగు వ్యాకరణానికి చెందినవి. వ్యాకరణ పారిభాషికా పదాలతో పరిచయం ఉన్న వారందరికీ గేయం సుళువుగానే అర్ధం కాగలదు.